అధికారంలోకి రాగానే.. ముస్లిం కోటా రద్దు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ వ్యతిరేక ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, వాటి ఫలాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. చేవెళ్లలో జరిగిన తొలి విజయసంకల్ప యాత్ర బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు చిలుకూరు బాలాజీ భగవాన్కి ప్రార్థనలు, ఉమ్మడి ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డికి ప్రణామాలంటూ ప్రసంగం ప్రారంభించారు. పార్టీకి పెరుగుతున్న మద్దతు, ఈ సభకు వచ్చిన ప్రజాస్పందన చూస్తుంటే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందనే విషయం స్పష్టమౌతోందన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని మొత్తం ప్రపంచ వీక్షిస్తోందన్నారు. చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్ప సభతో గత 8, 9 ఏళ్ల అవినీతిమయ బీఆర్ఎస్ పాలనకు రివర్స్ కౌంటింగ్ మొదలైనట్టేనని తెలిపారు. ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగ యువతను నిండా ముంచిన కేసీఆర్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. తాను మళ్లీ వస్తానని, అన్నింటికీ లెక్కలు అడుగుతానని, ఇచ్చిన హామీల అమలు ఏమయ్యిందో నిలదీస్తానన్నారు.













