సిరిసిల్లలో పర్యటించిన అమెరికా చేనేత పరిశోధకురాలు కైరా
అమెరికాకు చెందిన చేనేత పరిశోధకురాలు కైరా జాఫ్పీ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంట్‌తో ఆసియా దేశాల్లో చేనేత సంబంధిత రంగాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్న ఆమె రాష్ట్రంలోని పోచంపల్లి, గద్వాల్, జనగామలోనూ పర్యటించారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని, సిరిసిల్లలో నేతన్నలతో సమావేశమయ్యారు. పలువురు చేనేత కార్మికుల మగ్గాలను, వారు నేస్తున్న వస్త్రాలను చేనేత నైపుణ్యానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ వెల్దండి హరిప్రసాద్ రూపొందించిన చేనేత ఉత్పత్తులను, అగ్గిపెట్టలో ఇమిడే చీరను చూసి కైరా అబ్బురపడ్డారు. ఇంత నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులకు తాను ఇంతవరకు చూడలేదని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆమె వెంట తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభవృద్ధి కార్పొరేషన్ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టైక్స్‌టైల్ అధికారులు ఉన్నారు.













