వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం ముంబైకి బయలుదేరిన కుటుంబసభ్యులు
విప్లవ రచయిత వరవరరావు 80 సం. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 2020 ఏప్రిల్ 1నుండి ముంబై తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని జేజే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్నీ ముంబై పోలీసులు హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. చిక్కడపల్లి పోలీసులు వరవరరావు కుటుంసభ్యులకు విషయం చెప్పారు. జేజే ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స జరుగుతున్న తరుణంలో కుటుంబ సభ్యులు ముంబై కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
వరవరరావు కుటుంబ సభ్యుల ప్రయాణ ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా ఒక డీ ఎస్ పీ స్థాయి అధికారి కో ఆర్డినేట్ చేస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. తలోజా జైలులో ఓ ఖైదీకి కొరోనా సోకిన నేపథ్యంలో తమ తండ్రి ఆరోగ్యం కూడా బాగాలేనందున ఆయనకు బైలు ఇవ్వాలని ఇటీవల వరవరరావు కుమార్తెలు కోర్టును ఆశ్రయించారు. వరవరరావు ఆరోగ్యం బాగాలేదని తెలిసిన ఆయన అభిమానులు, పలువురు సాహితీవేత్తలు , ఉద్యమకారులు హైదరాబాద్ లో ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోని భీమా కోరేగావ్ సంఘటనలో వరవరరావు ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.













