ప్రధాని మోదీ ఆస్తులు ఎంతో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రూ.2 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. అయితే ఆయనకు సొంత కారుగానీ, ద్విచక్రవాహనంగానీ, ఎటువంటి అప్పులుగానీ లేవని తెలిపింది. స్వచ్ఛంద ఆస్తుల వెల్లడిలో భాగంగా మార్చి 31, 2018 వరకు ఉన్న వివరాలను పీఎంవో విడుదల చేసింది. ప్రధాని వద్ద రూ.48,944 నగదు అందుబాటులో ఉండగా, దాదాపు రూ.కోటికి పైగా నగదు బ్యాంకుల్లో ఉన్నది. వీటిలో గాంధీనగర్లోని ఒక ఎస్బీఐ ఖాతాలో రూ.11.29 లక్షలు, మరో ఎస్బీఐ ఖాతాలో రూ.1.07 కోట్లు ఉన్నాయి. రూ.20 వేల విలువైన ఎల్అండ్టీ ఇన్ఫ్రా బాండు, రూ.5.18 లక్షల విలువైన జాతీయ పొదుపు పత్రం, రూ.1.59 లక్షల విలువైన బీమా పాలసీ ఉన్నాయి. రూ.1.38 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. గాంధీనగర్లోని ఓ నివాస గృహంలో నాలుగో వంతు వాటా మోదీ పేరుపై ఉన్నది. 2002లో రూ.1.30 లక్షలకు దీన్ని కొనుగోలు చేసిన ఆయన, దానిపై రూ.2.47 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.కోటి వరకు ఉన్నది. ప్రధానికి అప్పులుగానీ, కార్లుగానీ, ద్విచక్రవాహనాలుగానీ లేవని పీఎంవో వెల్లడించింది.













