జూన్‌లో ట్రంప్‌తో మోడీ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. జూన్ చివరి వారంలో వాషింగ్టన్లో వీరు సమావేశం కావచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనా తర్వాత ప్రధాని తొలిసారిగా ఆయనను కలువనున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రధాన ఎజెండాగా ఈ చర్చలు సాగనున్నాయి. భారత్‌ను కలవరపాటుకు గురిచేస్తున్న హెచ్-1బీ వీసాల కోతపైనా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. అణు సరఫరా దేశాల కూటమిలో భారత్ చేరిక, ఇరు దేశాల మద్య రక్షణ ఒప్పందాలు, తూర్పు దక్షిణాసియాలో చైనా దూకుడు వ్యవహారం తదితర అంశాలూ వీరి భేటీలో చర్చకు రానున్నట్లు తెలిసింది. విదేశాంగశాఖ ఉన్నతాధికారులెవరూ ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. అమెరికా అధికారులు మాత్రం భేటీ జరిగే అవకాశముందని సూచనప్రాయంగా తెలిపారు. జూన్ 26 నుంచి 28 వరకు ప్రధాని మోడీ వాషింగ్టన్లో పర్యటించనున్నారని సమాచారం.













