ఇందిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామనే
మాజీ రక్షణ శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ భారత రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత కేంద్ర ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేశారు. మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయా మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే ఆరుగురు మహిళల్లో నిర్మలా సీతారామన్ ఉన్నారు. సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించడం ఆశ్చర్యం. భారత చరిత్రలో ఆర్థికశాఖకు మంత్రిగా చేసిన మహిళ కేవలం ఇందిరా గాంధీ మాత్రమే.
అయితే గత ఎన్డీయే ప్రభుత్వంలోనూ నిర్మలా సీతారామన్ కీలక బాధ్యతలే చేపట్టారు. ఎన్డీయే తొలి దశలో నిర్మలా రక్షణశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో నిర్మలా బేజీపీలో చేరారు. పార్టీ ప్రతినిధిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. 2014లో జూనియర్ మంత్రిగా మోదీ క్యాబినెట్లోకి ఆమె చేరారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఆమె ఎంపికయ్యారు. 2017, సెప్టెంబర్ 3వ తేదీన నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఇందిరా గాంధీ కూడా రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు.













