టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి, చైర్మన్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో, చైర్మన్‌ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రథమ సేవకుడిగా రెండోసారి అవకాశం రావడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు పెద్ద పీటవేస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు. సామాన్య భక్తులకు శ్రీఘ్రంగా స్వామి వారి దర్శనం కల్పించడంలో విజయవంతం అయ్యామని అన్నారు. తిరుమలలో చారిత్రాత్మక నిర్ణయాలు, మార్పులు తీసుకు రావడంతో పాటు వాటిని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.













