పార్టీ స్థాపించి 11 వసంతాలు పూర్తైన సందర్భంగా ట్వీట్ చేసిన ఏపీ సీఎం జగన్
వైఎస్సార్సీపీ స్థాపించి శుక్రవారంతో 11 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైసీపీ ఆవిర్భవించింది. విలువలు, విశ్వసనీయతల పునాదులపై పురుడు పోసుకుంది. పదేళ్ల ప్రయాణంలో ఎదురైన కష్టసుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు.’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
మరోవైపు వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగరేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… దేశ చరిత్రలోనే వైసీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని కొనియాడారు. పార్టీని సరికొత్త రాజకీయ విధానాలతో నడిపిన చరిత్ర వైఎస్ జగన్‌దని పేర్కొన్నారు. వైఎస్ మరణించిన తర్వాత ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో జగన్ ఒంటరిగానే పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. జగన్ ధైర్యానికి, పోరాటానికి పదేళ్ల రాజకీయ ప్రస్థానమే ఓ ఉదాహరణ అని సజ్జల వివరించారు. ఇక మంత్రి బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ… వైఎస్సార్ ఆలోచన, స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకొనే వైఎస్ జగన్ పార్టీని స్థాపించారని వివరించారు. వైఎస్ జగన్ పోరాటానికి నిదర్శనమే 2019 ఎన్నికల ఫలితాలని వివరించారు. ప్రజలకిచ్చిన ప్రతీ హామీనీ తాము నెరవేర్చామని, ఇలా నెరవేర్చిన నాయకుడు మరొకరు లేని బొత్స వ్యాఖ్యానించారు.













