Vallabhaneni Vamsi: వంశీకి దూరంగా వైసీపీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni vamsi) విషయంలో వైసీపీ(YSRCP) సైలెంట్ అయిపోయిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వంశీ అరెస్ట్ అయిన.. తర్వాత వైసీపీ నేతలు నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో ఉన్న జిల్లా జైలు వద్దకు కూడా వంశీని పరామర్శించేందుకు వెళ్లారు. అదే సమయంలో కృష్ణాజిల్లా నాయకులు కూడా వంశీని పరామర్శించేందుకు జైలు వద్దకు వెళ్లారు.
మాజీ మంత్రులు కొంతమంది వంశీతో ఆ తర్వాత కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే గత 15 రోజుల నుంచి వంశీ విషయంలో వైసీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనపడుతుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ మోహన్ విషయంలో పలు కేసులను బయటకు తీస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. దీనితో ఆయనకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ప్రభుత్వ పెద్దలను అప్పట్లో వంశీ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
దీంతో ప్రభుత్వ పెద్దలు వంశీ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారంటున్నాయి రాజకీయ వర్గాలు. భూకబ్జాల విషయంలో కూడా కృష్ణా జిల్లా పోలీసులు పలు సాక్ష్యాలు కూడా సేకరించి.. వంశీని ఇరుకున పెడుతున్నారు. ఈ సమయంలో వంశీకి వైసీపీ నేతల నుంచి గాని.. ఆ పార్టీ న్యాయవిభాగం నుంచి గాని పెద్దగా మద్దతు లభించడం లేదు. ఆ పార్టీ ప్రముఖ లాయర్, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. వంశీ విషయంలో సైలెంట్ అయిపోయారు.
ప్రస్తుతం పోసాని కృష్ణ మురళిని బయటకు తీసుకువచ్చే బాధ్యతను ఆయన భుజానికి ఎత్తుకున్నారు. దీనితో వల్లభనేని వంశీ తన కేసుల విషయంలో ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కృష్ణాజిల్లా నేతలు కూడా తమ కేసుల నుంచి తాము బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మినహా ఇతరులకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేరు. మరి వంశీ విషయంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. గన్నవరం నియోజకవర్గ నాయకులు కూడా వంశీని కలిసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా కూడా వంశీకి మద్దతుగా పోస్టులు పెట్టడం లేదు. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వంశీ గురించి పెద్దగా చర్చలు జరగడం లేదు.













