టీడీపీకి పేరు వస్తుంది అనుకుంటే.. రాజారెడ్డి పేరుతో
తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది అనుకుంటే, రాజారెడ్డి పేరుతో రూ.5కి అన్నం పెట్టండి అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంకుచిత స్వభావం, లేకి మనస్తత్వంతో అన్న క్యాంటీన్లు మూసివేశారని విమర్శించారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా నందమూరి బాలకృష్ణ అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తే మూసివేశారు. మంగళగిరిలో లోకేశ్ రూ.2కే భోజనం పెడుతూ అన్న క్యాంటీన్ మొదలు పెడితే బుల్డోజర్తో పీకేశారు అని తెలిపారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టినా చూడలేని ఈ భావదారిద్య్రం ఏమిటి? ఏం చేసినా ప్రభుత్వం డబ్బులతో చేయాలి. దాంట్లో నాలుగు రూపాయలు మిగలాలి అనే ఆలోచనే ఎపుడూ. సొంత ఖర్చులతో మంచి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాన్ని కూడా సహించలేని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. సంకుచిత స్వభావంతో వ్యవహరించడం వల్ల ప్రజల్లో చులకన అవుతామన్న బాధ కూడా లేదన్నారు. ఇలాంటి వ్యవహారాలు అత్యంత దుర్మార్గం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మంచివాడు అనిపించుకోకపోయినా కనీసం మనిషి అనిపించుకోండి అని అన్నారు.













