Jagan: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మూగబోయిన వైసీపీ గళం.. సూపర్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్న జగన్..
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ(YCP ) విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ (Privatization of Visakha steel plant) అంశంపై కేంద్రంతో తగిన స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, వైసీపీ ఈ అంశంలో పూర్తిస్థాయిలో పాల్గొనకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కూటమిపై ప్రజలలో ఉన్న సానుభూతిని తన వైపు తిప్పుకునే ఎటువంటి ప్రయత్నం వైసీపీ చేయకపోవడం పై కూడా పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ప్రకటన వచ్చినప్పుడు, వైసీపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ, ప్రతిపక్షాల సూచన మేరకు అఖిలపక్షంతో కలిసి కేంద్రాన్ని కలవడం వంటి చర్యలు చేపట్టలేదు. దీనిపై విశాఖ ఉక్కు కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లే వైసీపీ ఉత్తరాంధ్రలో కేవలం రెండు సీట్లకే పరిమితమైందన్న వాదన బలంగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, ఈ సమస్యపై గళం విప్పకపోవడం మరింత విమర్శలకి దారి తీస్తోంది.
ప్రస్తుతం విశాఖలో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఈ అంశంపై నిరసనలు, దీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విశాఖకు వచ్చిన వేళ, ఆయన నుంచి ప్రైవేటీకరణపై స్పష్టత కోరడంలో కాంగ్రెస్(Congress) , వామపక్షాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ పోరాటాల్లో నేరుగా పాల్గొనడం లేదు. ప్రధానిని ఎదుర్కొనడానికి ధైర్యం చాలడం లేదా లేక ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహం తమ దగ్గర లేదా.. అనే విషయంపై ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలోకి రాను అనే జగన్.. ఇలాంటి కలిసి వచ్చిన అవకాశాలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు రాజకీయ వ్యూహాలు సరిగా అమలు చేస్తే ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. టీడీపీ, జనసేన గతంలో ప్రభుత్వం మీద గళం విప్పి ప్రజల్లో ఆదరణ పొందిన విధంగా, వైసీపీ కూడా అదే వ్యూహం అనుసరించి ఉన్నత స్థాయిలో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి, విశాఖ ఉక్కు వంటి భావోద్వేగపూరిత అంశాన్ని వైసీపీ టేకప్ చేస్తే, రాజకీయంగా కూడా పార్టీకి గొప్ప మైలేజ్ దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ విశాఖకు వచ్చినప్పుడు వైసీపీ తన నిరసన కార్యక్రమాలను రోడ్ షోలు, సభ ప్రాంగణం వద్ద ప్లే కార్డుల ద్వారా గట్టిగా తెలియజేస్తే, ఈ అంశానికి సంబంధించి మరింత ఫోకస్ దక్కేఅవకాశం ఉండేది. మొత్తానికి జగన్ చురుకుగా కూటమిపై దాడి చేయాల్సిన అన్ని అవకాశాలను వదిలేసుకుంటున్నారు అన్న విషయం మాత్రం స్పష్టం అవుతుంది.













