Kadapa Steel Plant: ముగ్గురు ముఖ్యమంత్రులు.. నాలుగు శంకుస్థాపనలు.. కడప ఉక్కు కల ఈసారైనా నెరవేరుతుందా?

రాయలసీమ ప్రజల కలగా నిలిచిన కడప ఉక్కు పరిశ్రమ (Kadapa Steel Plant) నిర్మాణం పై పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా ముందడుగులు వేసింది. సున్నపురాళ్లపల్లె (Sunnapurallapalle), కడప జిల్లాలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ (JSW) కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం భూమి సర్వే పనులు వేగంగా జరుగుతుండగా, 2026 నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణం ప్రారంభించి 2029 నాటికి ఉత్పత్తి మొదలు పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వ్యవస్థాపిత ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈ టాపిక్ కాస్త రాజకీయంగా కీలకంగా మారింది. ఇటీవల మే నెలలో కడపలో టీడీపీ (TDP) మహానాడు సందర్భంగా కేవలం పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు నిజంగానే సర్వే పనులు మొదలవటంతో ఈ ప్రకటనలపై మళ్లీ చర్చ మొదలైంది. గతంలో నాలుగు సార్లు శంకుస్థాపన జరిగినా వాస్తవంగా పనులు ఎప్పుడూ జరగలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Dr. Y. S. Rajasekhara Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తొలిసారి ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన వేసారు. అనంతరం 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తిరిగి శంకుస్థాపన చేశారు కానీ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేదు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ముందుకొచ్చారు. ఆయన కూడా శంకుస్థాపన చేశారు కానీ ఐదేళ్ల కాలంలో పనులు గణనీయంగా ముందుకు సాగలేదు. మళ్లీ 2024 ఎన్నికల సమయానికి జేఎస్‌డబ్ల్యూ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగోసారి శంకుస్థాపన చేశారు. అయినా ఇంకా స్పష్టంగా పురోగతి కనిపించకపోవడంతో ప్రజల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. దీంతో దశాబ్దాలుగా శంకుస్థాపనలకే పరిమితమైన ఈ స్టీల్ ప్లాంట్ పై సీమ ప్రజలకు అనుమానాలు తలెత్తుతున్నా.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే 1100 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మొదటి దశలో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, రెండో దశ 2034 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక ఉంది. ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ పరిశ్రమపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్రం నుంచి సపోర్ట్ రాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో సర్వే పనులు మొదలవ్వడం కడప స్టీల్ పై ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అయితే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో శంకుస్థాపనల చరిత్ర పునరావృతం అవుతుందా లేక ప్రజల కలలు నెరవేరుతాయా అన్నది కాలమే సమాధానం చెప్పాలి..