Pulivendula: పులివెందుల ఉప ఎన్నికలో ఓటర్ల నిరసన..
పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. అయితే ఈ ఎన్నికల చుట్టూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రస్తుతం ఒకటి ఓటర్ల నిరసన.. మొత్తానికి పోలీసులకి ఓటర్లకి మధ్య ఓ రేంజ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ పులివెందుల ఎన్నికలను మరింత హీటెక్కిస్తున్నాయి.
వైసీపీ (YSRCP) అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) స్వస్థల నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారించింది. మొత్తం 10,600 ఓటర్లే ఉన్నప్పటికీ, టీడీపీ (TDP) మరియు వైసీపీ ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రత కోసం 2,000 మందికి పైగా పోలీసులు మోహరించారు.
ప్రచార దశ నుంచే ఇరు పార్టీలూ ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు అమలు చేశాయి. పోలింగ్ ప్రారంభానికి ముందే ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్సీతో పాటు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. అయినప్పటికీ ఉద్రిక్తత తగ్గకపోవడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అధికార పక్ష నేతలు పులివెందులలోనే ఉండి పరిస్థితిని గమనిస్తున్నారు.
రెండు మండలాలకు చెందిన ఓటర్లను సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. దూరం ఎక్కువైనా, ఓటు హక్కు వినియోగించేందుకు ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కొంతమంది ఓటర్లు పోలీసులు అడ్డుకోవడం వల్ల వెళ్లలేకపోయామని ఆరోపించారు. ఓటు వేయనివ్వాలని కోరుతూ కొందరు పోలీసులు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన వివాదంగా మారి, పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఓటర్లు తమ హక్కును ఎందుకు నిరోధిస్తున్నారని ప్రశ్నించారు. మరొక వైపు, పులివెందుల అడ్డా ప్రాంతంలో 150 మంది ఓటర్లు నిరసన చేపట్టారు. తమ ఓటర్ స్లిప్పులను కొందరు బలవంతంగా లాక్కున్నారని వారు ఆరోపించారు. ఓటు వేయడానికి వెళ్తుండగా మధ్యలో ఆపి స్లిప్పులను తీసుకున్నారని చెప్పి, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు.
ఈ పరిణామాలపై టీడీపీకి చెందిన కడప (Kadapa) ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి (Reddappagari Madhavi) స్పందించారు. పులివెందుల ప్రజలకు ఇప్పుడు ప్రజాస్వామ్యం అసలు అర్థం తెలుస్తోందని వ్యాఖ్యానించారు. గత ముప్పై ఏళ్లుగా స్థానికులను ఓటు కూడా వేయనివ్వలేదని ఆమె ఆరోపించారు. ఈసారి మాత్రం స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే కూటమి చెబుతున్న దానికి పులివెందుల ఎన్నికల్లో జరుగుతున్న దానికి పొంతనే లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి ఎన్నికల రోజు పులివెందులలో నెలకొన్న ఈ ఉద్రిక్త వాతావరణం, ఇరుపార్టీల పోటీ తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. అధికారులు శాంతిభద్రతలు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.. అయితే మరికొందరు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తున్న చర్యలుగా పేర్కొంటున్నారు.. దీంతో రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు.. ఇక పులివెందల ఫలితాలు ఏపీ రాజకీయాలలో ఎటువంటి మార్పులు తీసుకువస్తాయో చూడాలి..







