రాజ్యసభ వైస్ ఛైర్మన్ ల జాబితా నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగింపు!
రాజ్యసభ వైస్ ఛైర్మన్ల జాబితా నుంచి ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరును తొలగించారు. సోమవారం నాడు ప్రకటించిన జాబితాలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. వీరిలో విజయసాయిరెడ్డి కూడా ఒకరు. అయితే ఈ వైస్ చైర్మన్ల పేర్లను రాజ్యసభలో చదివి వినిపించిన చైర్మన్.. జాబితాలో విజయసాయిరెడ్డి పేరును విస్మరించారు. మరో ఏపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవలే.. విజయసాయిరెడ్డి ఇతర ఎంపీలపై అసభ్య ట్వీట్లు చేస్తున్నారంటూ రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యక్తిని వైస్ ఛైర్మన్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు విజయసాయిరెడ్డి పేరును రాజ్యసభ ఛైర్మన్ విస్మరించడం చర్చనీయాంశంగా మారింది.













