Vallabhaneni Vamsi: వంశీ తలతిక్క సమాధానాలు, పోలీసులకు పెరుగుతున్న బీపీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni vamsi) వ్యవహారం ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అతనిని కస్టడీకి తీసుకున్న తర్వాత కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్న సరే.. వంశీ మాత్రం నోరు మెదపడం లేదు. అలాగే పోలీసులకు అతను చెప్తున్న సమాధానాలు కూడా ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులతో అతను ప్రవర్తిస్తున్న విధానంపై పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం వంశీని మూడు రోజులు పాటు పోలీస్ కస్టడీ కి కోర్టు అనుమతించింది.
ఇక రెండో రోజు పోలీసులు అతన్ని దాదాపు 5 గంటలపాటు విచారించారు. మొదటి రోజు మూడు గంటల పాటు విచారించారు. మొదటి రోజు మాదిరిగానే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వంశీ దాటవేశారు. మొదటి రోజు అసలు తన ఫోన్లు ఎక్కడున్నాయో తనకు తెలియదని, ఎక్కడ పెట్టానో గుర్తులేదు అంటూ సమాధానం చెప్పారు. ఇక తనకు జ్ఞాపకం లేదని, తన దృష్టికి రాలేదని, తనకు తెలియదు అంటూ ఆయన సమాధానాలు చెప్పడం గమనార్హం. పోలీసులు ఆధారాలు చూపించి అడిగినప్పటికీ డొంకతిరుగుడు కూడా సమాధానాలు ఇచ్చారట వంశీ.
ఇక వంశీ తలతిక్క సమాధానాలతో విచారణ అధికారులలో అసహనం వ్యక్తం అయింది. ఇక రేపు మూడవరోజు కస్టడీలో వంశీని మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల విచారణలో కూడా ఎలాంటి వివరాలను వంశీ చెప్పలేదు. దీంతో మరోసారి వంశీని కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. గన్నవరం పార్టీ(TDP) ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించి వంశీ ఎటువంటి సమాచారం బయట పెట్టలేదు. అలాగే తన ప్రమేయం లేదని పదేపదే వంశీ చెప్పడం.. ఆ తర్వాత పోలీసులు సాక్షాలు చూపించడం, అయినా సరే వంశీ మాత్రం తాను ముందు చెప్పిన మాటకే కట్టుబడి ఉండటం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇక వంశీ పై బుధవారం కూడా మరో రెండు కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి 2024 వరకు దాదాపు 200 కోట్లకు పైగా ఆయన ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని, అలాగే రైతులకు నష్టపరిహారం పంపిణీ చేసే విషయంలో కూడా వంశీ తల దూర్చారు అనే ఆరోపణలు వినిపించాయి. అక్కడ కూడా రైతులకు అన్యాయం చేశారని, దాదాపు 110 మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని పోలీసులు గుర్తించారు. దీనిపై కూడా వంశీని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.













