అప్పుడే వారికి మెరుగైన భవిష్యత్తు : న్యూయార్క్ వర్సిటీ ప్రెసిడెంట్ ఆండ్రూ
యువత అన్ని రంగాల్లో పట్టుదలతో రాణించాలని, సృజనాత్మక ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని న్యూయార్క్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ డాక్టర్ ఆండ్రూ డి.హామిల్టన్ దిశానిర్ధేశం చేశారు. అప్పుడే వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి, విశ్వవిద్యాలయానికి పేరు తీసుకురావాలి. సృజనాత్మక ఆవిష్కరణలతో ముందుకెళ్లాలి. పట్టాలను అందుకుంటున్న అందరికీ అభినందనలు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి మంచి భవిష్యత్తు ఉంది అన్నారు.
అంతకుముందు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం కులపతి పారివేందర్ మాట్లాడుతూ ఆరేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ఎం వర్సిటీ ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ వర్సిటీల్లో ఒకటిగా నిలుస్తోంది. ఎస్ఆర్ఎంలో గతేడాది ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న వారిలో 70శాతం మంది ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు. మిగతా 30 శాతం మంది ఉన్నత చదువులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మార్గాన్ని ఎంచుకున్నారు అని తెలిపారు. అమెరికాలోని డాక్టరేట్, బీటెక్ పూర్తి చేసిన 288 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వీరిలో 22 మంది బంగారు పతకాలు సాధించారు.













