Chandrababu: ఈ విషయంలో అమెరికాతో చర్చలు…సీఎం చంద్రబాబు
హెచ్డీ బర్లీ పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కిలోలు కొనాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. రాష్ట్రం ఖర్చు పెడుతున్న రూ.300 కోట్లలో రూ.150 కోట్లు పొగాకు బోర్డు భరించేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు, పామోలిన్ దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై ప్రతీకార సుంకాలు, మామిడి గుజ్జుపై జీఎస్టీ తదితర అంశాలపై వారు చర్చించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు. పొగాకు ఉత్పత్తి మార్కెటింగ్‌ను బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కోరారు. ముడి పామోలిన్‌పై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్ర రైతులు నష్టపోతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యానికి కూడాది ఇది ఇబ్బందికరమేనని వివరించారు. సుంకం తగ్గింపు నిర్ణయంపై పునరాలోచన చేయాలన్నారు.
ఆక్వా ఎగుమతులపై అమెరికా (America) సుంకాల ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా 27 శాతం సుంకం విధించడం వల్ల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆక్వా రంగంపై ఆధారపడిన రైతులు సహా 8 లక్షల మందిపై ప్రభావం పడుతుందని వివరించారు. ఈ విసయంలో అమెరికాలో చర్చలు జరపాలన్నారు. మామిడి గుజ్జుపై 12 శాతం జీఎస్టీ (GST)ని 5 శాతం చేయాలని కోరారు. వివిధ సమస్యలపై కేంద్రమంత్రికి ఆయన వినతిపత్రం అందించారు.













