Undavalli: ఇది ప్రభుత్వ కక్షసాధింపే..! పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఉండవల్లి బాసట..!!

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar), ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు (PSR Anjaneyulu) బాసటగా నిలిచారు. సినీనటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలులో పీఎస్ఆర్ ఆంజనేయులను ఉండవల్లి అరుణ్ కుమార్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై అధ్యయనం చేస్తున్నానని., డీజీ స్థాయి అధికారిని అరెస్టు చేయడం ఆషామాషీ విషయం కాదని ఉండవల్లి అన్నారు. ఇది పెద్ద చర్చకు దారి తీస్తుందని చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో సినీనటి కాదంబరి జెత్వానీతో పాటు ఆమె కుటుంబసభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వైసీపీ నేతు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఛీటింగ్ కేసు పెట్టారు. అయితే ముంబైలో ఓ పారిశ్రామిక వేత్తను కాపాడేందుకే ఆమెపై కేసు పెట్టారనే ఆరోపణలున్నాయి. వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదంబరి జెత్వానీ.. తనను వేధించారంటూ కొంతమంది పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అందులో పాలుపంచుకున్న పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరుపుతోంది.
కాదంబరి జెత్వానీ కేసు సూత్రధారి పీఎస్ఆర్ ఆంజనేయులేనని పోలీసులు చెప్తున్నారు. ఈయన ఆదేశాల మేరకే కాంతి రాణా టాటా, విశాళ్ గున్నీ నడుచుకున్నారని FIR నమోదు చేశారు. దీంతో ఈ కేసులో పీఆర్ఎస్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు. అయితే డీజీ స్థాయి అధికారిని అరెస్టు చేయడంపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ఏదైనా చర్య తీసుకుంటే .. అది కుట్ర అని భావించి వాళ్లను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇలా చర్యలు తీసుకోవాల్సి వస్తే పోలీసుసందరినీ లోపల వేయాల్సి వస్తుందన్నారు.
పీఎస్ఆర్ ఆంజనేయులును జైలులో కలిసినప్పుడు ఆయన కులాసాగానే ఉన్నారని.. తనపై ఇంకా కేసులు నమోదవుతాయని చెప్పారని ఉండవల్లి వివరించారు. పాతకేసు విచారణ పెండింగులో ఉండగానే దాన్ని సాకుగా చూపి కొత్త కేసు నమోదు చేయడం, డీజీ స్థాయి పోలీసు అధికారులను అరెస్టు చేయడం కక్షసాధింపుగానే పరిగణించాల్సి ఉంటుందని ఉండవల్లి అన్నారు. కక్షసాధింపు చర్యలు వద్దని తాను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సూచించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు కూడా ఇప్పుడు పార్టీల వారీగా చీలిపోయారని ఉండవల్లి అన్నారు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే పోలీస్ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.