జీజీహెచ్‌కు రూ.20 కోట్ల ఆస్తిని విరాళమిచ్చిన ఉమాదేవి గవని
గుంటూరు జిల్లాకు చెందిన వైద్యురాలు ఉమాదేవి గవని అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమె 1965లో గుంటూరు వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్ధిరపడ్డారు. ఆమె భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు మూడేళ్ల కిందట చనిపోయారు. వారికి వారసులు లేరు. దీంతో డాక్టర్ ఉమ తన రూ.20 కోట్ల విలువైన ఆస్తిని గుంటూరు జీజీహెచ్ కు విరాళంగా ఇచ్చారు.
దీంతో సర్వజనాసుపత్రి(జీజీహెచ్)లో మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గత పది సంవత్సరాల కల సాకారం కానుంది. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.86.80 కోట్లు ఇక్కడ చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు(జింకాన) భరించేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ గత జూన్ నెలలో ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ కేంద్రానికి కానూరి రామచంద్రరావు-జింకాన-మాతా శిశు సంరక్షణ కేంద్రంగా పేరు పెట్టాలని నిర్ణయించారు.
అందుబాటులో ఉన్న 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్‌తో పాటు జి 5 బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి 300 పడకలు, చిన్న పిల్లల విభాగానికి 200 పడకలు, పీఐసీయూ 27 పడకలు, ఎస్ఐసీయూ 30 పడకలు, ఎన్ఐసీయూ 40 పడకలు కేటాయించారు. బోధనానిపుణులకు 30 గదులు, ఒకేసారి 300 మంది వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరం ఏర్పాటు చేయనున్నారు. సర్వజనాసుపత్రిలో ప్రస్తుతం అని విభాగాల్లో 1,200 పడకలున్నాయి. అదనంగా మరో 597 పడకలు సమకూరనున్నాయి. బిడ్డలకు జన్మనిచ్చే మాతృమూర్తులు పడుతున్న ఇబ్బందులను చూసి జింకాన సభ్యులు చలించి ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం రూ.35 కోట్లు, జింకాన రూ.30 కోట్లు భరించేవిధంగా 2019, ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారు రూ.6.27 కోట్ల నిర్మాణ పనులు చేసి నిలిపివేశారు. మూడేళ్లు దాటినా ఆ ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో జింకాన సభ్యులే ప్రాజెక్టు పనులు మొత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. అవసరమైన అనుమతులు వచ్చే విధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా కృషి చేశారు. ఇప్పటికే జింకాన పేరున రూ.30 కోట్లు ఉన్నాయి. ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లో జింకాన సభ్యులు సమావేశమై సుమారు రూ.45 కోట్లు విరాళం ప్రకటించారు. ఇందులో గవని ఉమాదేవి తన భర్త కానూరి రామచంద్రరావు పేరున సుమారు రూ.22 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి రూ.100 కోట్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో మరో రూ.25 కోట్లు అవసరం కావడంతో స్థానికంగా ఉన్న వైద్యులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఎన్జీవోల నుంచి నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు జింకాన పూర్వ అధ్యక్షుడు రవికుమార్ త్రిపురనేని తెలిపారు.













