తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. వృద్ధులు, చిన్న పిల్లలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గద్శకాల మేరకు 65 ఏళ్లు పైబడి వారు, 10 ఏళ్లలోపు పిల్లలను స్వామి వారి దర్శనానికి అనుమతించడం లేదు. దీనిపై టీటీడీకి నిత్యం వేల సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయి. చిన్న పిల్లల కేశ ఖండన, చెవిపోగులు కుట్టడం, అన్నప్రాసన, షష్టి పూర్తి చేసుకొనేవారు, 70-80 ఏళ్ల శాంతి చేసుకొనే వారు ఉంటున్నారు. భక్తులు ఆచారాలు, సంప్రదాయాలు, మనోభోవాలతో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్ల పైబడిన వారు, పదేళ్ల లోపు పిల్లలు కోవిడ్ సూచనలు దృష్టిలో ఉంచుకుని, వారి ఆరోగ్య పరిస్థితులను గమనించుకొని జాగ్రత్తలతో స్వామి దర్శనానికి రావచ్చని తెలిపింది. ముందస్తుగా దర్శన టికెట్టు బుక్ చేసుకోవాలని, వీరికి ఎలాంటి ప్రత్యేక క్యూలైన్లు ఉండవని టీటీడీ తెలిపింది.













