టీటీడీ ఆస్తులను ఎట్టిపరిస్థితుల్లో అమ్మం : వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తులు, భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సృష్టం చేశారు. ఈ మేరకు టీటీడీ పాలకమండలిలో తీర్మానించినట్లు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆస్తుల విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీటీడీ ఆస్తులు విక్రయిస్తున్నారనే దుష్ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో టీటీడీ పాలకమండలిపై ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాల్సిందేనని బోర్డు తీర్మానించిందని, ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. అలాగే టీటీడీ పరిధిలోని అతిథి గృహాలను నిబంధనలకు విరుద్ధంగా ఎవరికీ కేటాయించలేదని సృష్టం చేశారు. అతిథిగృహాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని బోర్డు తీర్మానించినట్లు వివరించారు. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని టీటీడీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డొనేషన్ స్కీమ్‌లోనూ అర్హులకే అతిథి గృహాలు ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు.













