జనసేన మద్దతు లేదన్న ప్రచారం అబద్ధం : రత్నప్రభ
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాష్ట్ర వాణిని పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తానని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పేర్కొన్నారు. ఇన్నాళ్లకు సొంత గడ్డకు సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఇలా పనిచేయడంలోనే ఆనందం ఉందని అన్నారు. బీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. ఆ ప్రచారం సరికాదని తేల్చి చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన అభ్యర్థిత్వంపై 200 శాతం సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ప్రచారానికి కూడా వస్తానని ఆయన అన్నారని ఆమె వెల్లడించారు. గతంలో తాను వైఎస్ జగన్‌ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌ను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పని చేస్తే ప్రశంసించానని, అంత మాత్రాన మద్దతిచ్చినట్లు ఎలా అవుతుందనని సూటిగా ప్రశ్నించారు. ఏపీ తనకు మాతృభూమి అయితే, కర్నాటక కర్మభూమి అని పేర్కొన్నారు. తాను కర్నాటక కేడర్‌లో పనిచేసినా, సొంత రాష్ట్రమైన ఏపీకి ఏదో చేయాలన్న తపన తనలో ఉండేదని రత్నప్రభ తెలిపారు.













