ఎన్నికల బరిలో ముగ్గురు అపూర్వ సహోదరులు.. అసలు గెలుపు ఎవరిదో?
ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో.. ఆంధ్రాలో ప్రధానంగా పోరు వైసీపీ.. టీడీపీ మధ్య కేంద్రీకృతమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందు నుంచి 175 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. వీళ్లు ప్రకటించిన అభ్యర్థులలో 50% అంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించారు. అయితే ఈ లిస్టులో అందరినీ ఆకర్షిస్తున్న మరొక విషయం జాబితాలో ఉన్న ముగ్గురు అన్నదమ్ముల పేర్లు. 2019లో జరిగిన ఎన్నికలలో ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో మరొకసారి మూడు స్థానాల నుంచి ఈ ముగ్గురికి టికెట్లు దక్కాయి. మంత్రాలయం నుంచి వై బాల నాగిరెడ్డి పోటీ చేస్తుండగా, గుంతకల్ నుంచి వై. వెంకట రామిరెడ్డి బరిలోకి దిగుతున్నాడు. ఇక వీరితోపాటు ఆదోని నుంచి వై. సాయి ప్రసాద్ రెడ్డి కూడా పోటీకి దిగుతున్నారు. వీరు ముగ్గురు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి కొడుకులు. వీళ్ళలో బాలనాగిరెడ్డి ,సాయి ప్రసాద్ రెడ్డి 2014, 2019 ఎన్నికలలో గెలిచారు. వెంకటరామిరెడ్డి మాత్రం 2014 ఎన్నికల్లో ఓడిపోయి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. మరి ఈసారి ఎన్నికల్లో ఈ ముగ్గురు అపూర్వ సహోదరులలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అన్న విషయం తెలియాల్సి ఉంది.













