కరోనా వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావ్యాక్సిన్ తీసుకోవాలనుకునే అర్హులు తమ ఆధార్ కార్డులు చూపిస్తే చాలు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే తొలుత కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి రిజిస్ట్రేషన్ పై అవగాహన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారికి అలాగే 45 ఏళ్లు పై బడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు టెస్టుల రిపోర్టులు, డాక్టర్లు ఇచ్చిన మందుల చీటీలు, ఇతర ఆధారాలు చూపించాలి.. అప్పుడే టీకా వేస్తారు.
ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా టీకా తీసుకోవాలని అనుకునే వారు చూపించిన ఆధారాలతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ ఇచ్చేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. ప్రతి వ్యాక్సిన్ సెంటర్ లో నిపుణులైన డాక్టర్లు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వాస్వత్రులు, ఆరోగ్య శ్రీ ట్రస్టు పరిధిలోని ఆస్పత్రుల్లో టీకా వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.