అమెరికాలో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గంగూరి శ్రీనాథ్ (32) అమెరికాలో మృతి చెందారు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు, రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణ్, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు అయిదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఆరు నెలల క్రితమే అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ఆహ్లాదంగా గడిపేందుకు భార్యభర్తలు అట్లాంటాలో సాహస యాత్ర ( ట్రెక్కింగ్)కు వెళ్లారు. క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌లో ఎత్తయిన ప్రదేశానికి వెళ్లిన శ్రీనాథ్ ప్రమాదవశాత్తూ 200 అడుగుల ఎత్తు నుంచి కింత పడి మృతి చెందారు.
ఈ సమాచారం అందడంతో శ్రీనాథ్ తల్లిదండ్రులు మళ్లేశ్వరి, బాబూరావు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకువచ్చేందుకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని మృతుడి మామ సుఖవాసి శ్రీనివాసరావు తెలిపారు. అమెరికాలో ఉంటున్న గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, గుంటూరుకు చెందిన ప్రవాసాంధ్రులు మల్లిక్ మేదరమెట్ల, అశోక్ కొల్లా, నరేష్ కాకర్ల, బాదిత కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు.













