ప్రతి చేనేత కుటుంబం టిడిపి వెన్నంటే ఉండాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
చేనేత కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కలిసి చేనేత సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తిచేశారు. గురువారం ప్రజావేదికలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో చేనేత సంఘాల ప్రతినిధులు భేటి అయ్యారు. మంగళగిరి టిడిపి ఇన్ చార్జ్ గంజి చిరంజీవి, టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ నేతృత్వంలో చేనేత సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున ప్రజావేదికకు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వారు తమ డిమాండ్లను తెలియజేశారు.‘‘ చేనేత కార్పోరేషన్ కు రూ.2వేల కోట్లు నిధులు ఇవ్వాలి.చేనేతపై జిఎస్ టిని పూర్తిగా రద్దుచేయాలి.ప్రతి చేనేత కార్మికునికి బిసి కార్పోరేషన్ ద్వారా 50% సబ్సిడితో రుణసదుపాయం ఇవ్వాలి.చేనేత సహకార సంఘాలలో ప్రస్తుతం ఉన్న క్యాష్ క్రెడిట్ ను రద్దుచేస్తూ మళ్లీ సంఘాలకు క్యాష్ క్రెడిట్ ఇప్పించాలి. చేనేత సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలను ప్రభుత్వమే భరించాలి.ఆప్కో కొనుగోలు చేసే దుస్తులకు సంబంధించి చెల్లింపులను ప్రతి 2నెలలకు ఒకసారి సంఘాలకు జరపాలి. సంఘాలు ఉత్పత్తి చేసే వస్త్రాలను ప్రతినెలా కొనుగోలు చేయాలి.ఆప్కో దుకాణాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో సహకార సంఘాలలో పనిచేసేవారితో భర్తీచేయాలి’’ అని కోరారు.
దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ గత 55నెలల్లో చేనేతలకు రూ.111కోట్లు రుణమాఫీ చేసిన విషయం గుర్తు చేశారు. నేతన్నల మద్ధతుతోనే టిడిపి గత 36ఏళ్లుగా పేదల సేవలో ఉందన్నారు. వారి డిమాండ్లపై అధికారులతో వెంటనే చర్చించి త్వరిగతిన నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసిల సంక్షేమానికి చేపట్టిన చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీసి సబ్ ప్లాన్ దేశంలోనే తొలిసారిగా తెచ్చామని, రూ.40వేల కోట్లు బిసి సంక్షేమానికి ఖర్చుచేశామని, పేద బీసి విద్యార్ధులను విదేశాలకు పంపి చదివిస్తున్నామని గుర్తుచేశారు. ప్రతి చేనేత కుటుంబం టిడిపి వెంటే ఉండాలని కోరారు.
ముఖ్యమంత్రితో భేటి అయినవారిలో గుతికొండ ధనుంజయ రావు,దామర్ల మోహన్,జంజనం కృష్ణమూర్తి, పూర్ణ ప్రసాద్, నాగేశ్వర రావు,రామారావు,నాంచారయ్య, గుంటూరు జిల్లా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, టిడిపి చేనేత రాష్ట్ర విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.













