ఆయనలో ఒక భగత్ సింగ్… అల్లూరిని చూస్తారు
అడ్రస్ తెలియని జీవీఎల్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. నవ్యాంధ్రలో రాజకీయాలు కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా మారనున్నాయని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. 2019లో టీడీపీ ఇక్కట్లు తప్పవని, ఈ పరిస్థితులను చంద్రబాబు ఎదుర్కోవలసి వస్తుందని జీవిఎల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బుద్దా మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో జీవిఎల్ లాంటి ఎంతోమందిని తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
చంద్రబాబులో సంస్కారం, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి, నేర్చుకుని మోదీ గుజరాత్లో పారిపాలన సాగించారని వెంకన్న ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తిని బెదిరించేంత సీన్ బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూసించే గాంధీ అని, రాష్ట్ర ప్రజల కోసం సౌమ్యంగా ఉంటారని, అలాంటి ఆయన రాష్ట్రం కోసం పోరాడాలని, ఎదురు తిరిగినప్పుడు ఆయనలో ఒక భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజును చూస్తారని అన్నారు. జీవీఎల్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, మోదీ కాళ్ల వద్ద జపం చేసుకునేవ్యక్తిని ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే చంద్రబాబుతో మోదీ గానీ, అమిత్ షా గానీ మాట్లాడాలని, దానికి సీఎం సమాధానం చెబుతారని ఆయన సవాల్ చేశారు. అంతేగానీ నీలాంటి అడ్రస్ లేని వ్యక్తులకు చంద్రబాబు సమాధానం చెప్పాలిన అవసరం లేదని అన్నారు.













