ముద్రగడపై ప్రేమతో వెళ్లారా? రాజకీయ ప్రయోజనం కోసం వెళ్లారా? :గోరంట్ల
ముద్రగడను కడసారి చూసేందుకు వెళ్లిన ఆయన కుమార్తెను వైసీపీ నేతలు అడ్డుకోవడం ఏంటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (Gorantla Butchaiah Chowdary) ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరామర్శకు వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan) ర్యాలీగా వెళ్లడమేంటని ఆక్షేపించారు. ముద్రగడపై ప్రేమతో వెళ్లారా? రాజకీయ ప్రయోజనం కోసం వెళ్లారా? అని నిలదీశారు. మత్స్యకారులు, ఆక్వా రైతులకు వైసీపీ హయాంలో జగన్ ఏం చేశారో చెప్పాలని అన్నారు. బైక్‌తో ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) కుమారుడిని జగన్ వెనకేసుకుని రావడమేంటని ప్రశ్నించారు. ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu), వైసీపీ నేతలు అడ్డుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బుద్ది చెప్పినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదన్నారు.








