ఢిల్లీ సీఎంను కలిసిన టీడీపీ ఎంపీలు
లోక్‌సభలో రేపు జరిగే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ఇప్పటికే వివిధ పార్టీల నేతలను కలిసిన టీడీపీ ఎంపీలు ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన బుక్‌ను క్రేజీవాల్‌కు ఎంపీలు అందజేశారు. అనంతరం ఎంపీ సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సమస్యలపై కేజ్రీవాల్ క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారని తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాల్సిందిగా కేజ్రీవాల్‌ను కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ను కలిసిన వారిలో సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, శ్రీరాం మాల్యాద్రి, టీజీ వెంకటేష్, నిమ్మల కిష్టప్పలు ఉన్నారు.
ఏపీకి అండగా ఉంటాం : ఆప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ భరోసా ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ సమయంలో మద్దతుగా ఉంటామని తెలిపారు. ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేసిందని ఎంపీ సంజయ్‌సింగ్ విమర్శించారు. అవిశ్వాసం తీర్మానంపై మద్దతు ఇవ్వాల్సిందిగా ఆప్ అధినేత కేజ్రీవాల్‌తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు.













