TDP: అవన్నీ ఊహాగానాలే.. మంత్రివర్గ విస్తరణ పై టీడీపీ స్పష్టత..

ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ గురించి గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది .కొందరు పాతవారు వెళ్లిపోతారని, కొత్తవారు వస్తారని, ఆగస్టులో 6 నుంచి 15వ తేదీల మధ్య ముహూర్తాలు కూడా ఖరారయ్యాయని కథనాలు వేశారు. ఎవరెవరు మంత్రివర్గం నుంచి వెళ్లిపోతారు? ఎవరు కొత్తగా బాధ్యతలు చేపడతారు? అనే అంశాలపై కూడా ఎన్నో అంచనాలు నడిచాయి . కానీ తాజాగా తెలుగుదేశం పార్టీ (TDP) ఈ ప్రచారాలకు తెరదించింది.
ఇప్పటికీ ఈ విషయంపై స్పందించిన టీడీపీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. మంత్రివర్గ విస్తరణ లేదని, దీనిపై జరుగుతున్న వార్తలు నిజాలకు దూరంగా ఉన్నవని తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వంలో కేబినెట్ సంపూర్ణ సమన్వయంతో పని చేస్తోందని స్పష్టం చేసింది. వాస్తవానికి ఇప్పుడే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తవ్వలేదు. ఈ తరుణంలో మంత్రివర్గ మార్పుల గురించి ఊహాగానాలు చెలరేగడం ఆశ్చర్యకరం.
ఇక గుంటూరు (Guntur), కర్నూలు (Kurnool), విశాఖపట్నం (Visakhapatnam) వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్రచారాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీంతో తమ పదవుల అస్పష్టతపై కొంతమంది మంత్రులు, వారి మద్దతుదారులు ఆలోచనలో పడిపోయారు. అయితే పార్టీ స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఆగస్టులో ముహూర్తాలు ఖరారయ్యాయని, ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రులు తప్పుకోవచ్చనే ప్రచారం కూడా చేసినప్పటికీ, తెలుగుదేశం ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఇవన్నీ కేవలం ఊహలతో రాసే కథనాలు తప్పుదోవ పట్టించేవే అని మండిపడింది. ప్రభుత్వ పరిపాలన బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న వేళ, ఇలా గాలి వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని అభిప్రాయపడింది.
గతంలో జరిగిన ఒక మంత్రివర్గ సమావేశంలో సీఎం ఆగ్రహించినట్లు వచ్చిన కథనాలు కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చాయి. కానీ ఇవన్నీ నిరాధారమైనవని తాజా పరిణామాల ద్వారా స్పష్టమైంది. ఏదేమైనా, టీడీపీ భావనలు, నిర్ణయాలు మీడియా ఊహలకు అందవు. పార్టీ నిర్ణయాలు అవసరమైన సమయంలోనే వెలుగులోకి వస్తాయనే విషయాన్ని ఈ సందర్భం మరోసారి రుజువు చేసింది. ఇప్పుడు చూస్తే, మంత్రివర్గంలో మార్పులు అంటూ ఎటువంటి చర్యలు లేవని స్పష్టంగా తెలుస్తోంది.