కుమారస్వామి ప్రమాణస్వీకారానికి చంద్రబాబు!
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే అవకాశముంది. ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనే దానిపై మంత్రుల అభిప్రాయం తీసుకునేందుకు ఆయన టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులంతా మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఏకగ్రీవంగా సూచించారు. దేవగౌడతో మీకు సాన్నిహిత్యం ఉంది. గతంలో మనం గుంటూరులో నిర్వహించిన రైతు కోసం సభకు ఆయన వచ్చారు. ఆయన్ను ప్రధాని చేయడంలో మీరు కీలక పాత్ర పోషించారు. జనతాదళ్ (ఎస్)తో మీకు సాన్నిహిత్యం ఉంది. కుమారస్వామే స్వయంగా ఫోన్ చేసి మిమ్మల్ని ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి వెళ్తే దేశానికి సరైన సంకేతం వెళ్తుంది. అని మంత్రులు సూచించగా, చంద్రబాబు దీనిపై సానుకూలంగా స్పందించారు.













