Rayalaseema: సీమపై స్పెషల్ ఫోకస్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయలసీమకు (rayalaseema) ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో ఈ ప్రాంతం వైసీపీ కంచుకోటగా పేరొందింది. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ కోటను బద్దలు కొట్టి, రాజకీయ శక్తిగా ఉద్భవించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అనంతపురంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ (Super Six Super hit) విజయోత్సవ సభ కూటమి పార్టీల ఆధిపత్యాన్ని, ఉత్సాహాన్ని మరోసారి నిరూపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభగా చరిత్రలో నిలిచిపోతుంది.
రాయలసీమ గతంలో వైసీపీకి అడ్డాగా ఉండేది. అయితే, 2024 ఎన్నికల్లో కూటమి ఈ ప్రాంతంలో అనూహ్య విజయాన్ని సాధించింది. ఇటీవల పులివెందులలో జడ్పీటీసీ స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోవడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఈ విజయాలతో ఉత్సాహం పొందిన టీడీపీ, రాయలసీమలో వైసీపీ ప్రాబల్యాన్ని పూర్తిగా తొలగించి, ఈ ప్రాంతాన్ని తమ కంచుకోటగా మార్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ లక్ష్యంతోనే అనంతపురంలో ఈ సభను అట్టహాసంగా నిర్వహించి, రాజకీయ శక్తిని ప్రదర్శించింది.
రాయలసీమలో సాగునీటి కొరత ఎప్పుడూ ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలను రాయలసీమకు తరలించే బృహత్తర ప్రణాళికను అమలు చేస్తోంది. గత ఏడాదిన్నరలో రెండోసారి కృష్ణా జలాలు బిరబిరా ప్రవహిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాయలసీమ రైతులకు ఆర్థిక భరోసాను అందించడమే కాక, కూటమి ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచింది. అదే సమయంలో రాయలసీమలో పెద్దఎత్తున పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. డిఫెన్స్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రాయలసీమను ఎంచుకుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కదాన్ని మినహా అన్నింటినీ ఏడాదిలోపే అమలు చేసి చూపించింది. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది. తల్లికి వందనం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది. ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పింఛన్లను రూ.4000 చేసింది కూటమి ప్రభుత్వం. ఇది మంచి పేరు తీసుకువచ్చింది.
కూటమి ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రోడ్ల అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలతో పాటు పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఈ సభ ద్వారా కూటమి తమ రాజకీయ శక్తిని, అభివృద్ధి దృష్టిని ప్రజలకు చాటిచెప్పింది. రాయలసీమను తమ కంచుకోటగా మార్చుకోవడం ద్వారా, వైసీపీని రాజకీయంగా కోలుకోకుండా చేయాలనే టీడీపీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.