శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ
శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందు కోసం శుక్రవారం రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం విశ్వరూప సర్వదర్శనం, సాయంత్రం 5:48 నుంచి 6 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామి వారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒకరోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదే రోజు రాత్రి బ్రహ్మూెత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం (బీజవాపనం) జరుగుతుంది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.













