సింగపూర్లో మంత్రి అరెస్ట్..! చంద్రబాబుకు ఇబ్బందులు..!?
అధికారంలో ఉన్న నేతలు తీసుకునే నిర్ణయాలు వాళ్లను కొన్నిసార్లు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్లు పదవిలో ఉన్నా లేకపోయినా వాటి తాలూకు ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత దాని అభివృద్ధికోసం సింగపూర్ తో ఒప్పందాలు చేసుకున్నారు చంద్రబాబు. అయితే ఆ ఒప్పందాల ప్రభావం ఇప్పుడు చంద్రబాబుపై పడుతోంది.
అమరావతిని అత్యంత ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దాలని.. ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన నగరంగా దీన్ని రూపొందించాలని చంద్రబాబు కలలుకన్నారు. దీనికోసం అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెంట్లను నియమించుకుని డిజైన్స్ రూపొందించుకున్నారు. వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోనే అత్యంత ఎఫెక్టివ్ కంట్రీగా పేరొందిన సింగపూర్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఏపీతో ఒప్పందాల విషయంలో అన్నీతానై వ్యవహరించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఈశ్వరన్ హాజరయ్యారు. ఈశ్వరన్ తో చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే చంద్రబాబు ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి అటకెక్కింది. అది వేరే సంగతి.
అయితే ఇప్పుడు సింగపూర్ లో మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ శాఖ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంతేకాక ఈశ్వరన్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రి పదవి నుంచి ఈశ్వరన్ ను తాత్కాలికంగా తప్పించారు ఆ దేశ ప్రధాని. వెంటనే ఈశ్వరన్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. సింగపూర్ లో అవినీతికి పాల్పడితే కఠిన శిక్షలుంటాయి. ఈశ్వరన్ కు కూడా కఠిన శిక్ష అమలు చేయడం ఖాయమనే ఆరోపణలున్నాయి.
అయితే చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న ఈశ్వరన్ సింగపూర్లో అరెస్టు కావడంతో వైసీపీ అలెర్ట్ అయింది. ఈశ్వరన్ కు చంద్రబాబుకు మధ్య ఆర్థిక లావాదేవీలు భారీగా జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈశ్వరన్ కు చెందిన ఓ సంస్థకు ఆంధ్రప్రదేశ్ నుంచి నిధుల వరద పారిందని.. ఆ నిధుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. సింగపూర్ ప్రభుత్వం విచారణలో చంద్రబాబు పేరు కూడా రావడం ఖాయమని.. ఆయన్ను కూడా అరెస్టు చేస్తారని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబుకు, ఈశ్వరన్ కు మధ్య నిధుల మళ్లింపు జరిగిందా లేదా అనేది తెలీదు. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.













