ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ముగిసేది ఎప్పుడంటే?.. వర్సిటీ పరిశోధనలో ఆసక్తిర విషయాలు వెల్లడి

అమరావతి: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితిలు ఘోరంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ఆర్ఎమ్ వర్సిటీ గ్రాడ్యుయేట్లు ఏపీ ప్రజలకు ఆసక్తికర విషయం చెప్పారు. వారి అంచనాల ప్రకారం ఏపీలో కరోనా సెకండ్ వేవ్ జూలై మధ్య కాలం నాటికి ముగిసిపోతుంది. ఈ మేరకు వీరు తయారు చేసిన మెషీన్ లెర్నింగ్ మోడల్ అంచనా వేసింది.
గత వారం రోజులుగా ఏపీలో రోజుకు 20వేల పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా అధికంగానే ఉంది. ఈ క్రమంలో ససెప్టిబుల్-ఇన్‌ఫెక్టెడ్-రికవర్డ్ (ఎస్ఐఆర్) మోడల్‌ను ఉపయోగించి ఎస్‌ఆర్‌ఎమ్ వర్సిటీ విద్యార్థులు ఒక అంచనాకు వచ్చారు. వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా ఉంటుందో తగ్గుదల కూడా అంతే వేగంగా గనుక ఉంటే.. ఈ ఏడాది జూలై 15 నాటికి రాష్ట్రంలో రోజుకు 100 కేసుల కన్నా తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని ఈ పరిశోధనలో తేలింది. పరిశోధన అంచనాల ప్రకారం. ప్రస్తుతం రోజుకు 20వేలపైగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. మే 30 నాటికి 15వేలకు, మే 21కి 10వేలకు చేరుతుందట. ఆ తర్వాత జూన్ 14వ తేదీకి ఈ సంఖ్య 1000కి చేరి, జూన్ 23 నాటికి 500కు పడిపోతుంది. చివరగా జూలై 15కు ఈ సంఖ్య కేవలం 100కు తగ్గుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు. నమోదైన కేసులు, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఈ పరిశోధన చేసినట్లు సమాచారం. ఈ సమాచారం మొత్తాన్ని కంట్రోల్ కమాండ్ సెంటర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.