Sajjala: సంకర జాతి కామెంట్స్… సజ్జలపైనా కేసు ఖాయమా…?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై (Amaravati) చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ చానెల్‌లో జరిగిన చర్చలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు (VVR Krishnam Raju) అమరావతి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు చేశారు. ఆ చర్చను నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) వాటిని అడ్డుకోకపోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్టులతో పాటు ఆ మీడియా యాజమాన్యంపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి ఏపీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న కృష్ణంరాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వివాదం కొనసాగుతుండగానే… వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు మరింత రచ్చ రాజేస్తున్నాయి.
ఓ టీవీ చానల్ లో జరిగిన చర్చలో కృష్ణంరాజు అమరావతిని “వేశ్యల రాజధాని”గా అభివర్ణించడం, కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం రాష్ట్రంలో ఆగ్రహావేశాలను రేకెత్తించింది. అమరావతి మహిళలు విజయవాడలోని ఆ మీడియా కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టి, కార్యాలయ బోర్డును తొలగించారు. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు ర్యాలీలు నిర్వహించి, ఆ జర్నలిస్టులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆ మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జాతీయ మానవ హక్కుల సంఘం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం ఈ అంశంపై మీడియాతో మాట్లాడారా. ఈ సందర్భంగా కొమ్మినేని, కృష్ణంరాజులకు మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వాళ్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని “సంకర జాతి”గా విమర్శించారు. ఇది మరో వివాదానికి దారితీసింది. సజ్జల వ్యాఖ్యలను పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల సజ్జల కామెంట్స్ ను ఖండిస్తూ, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ Xలో ట్వీట్ చేశారు “సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలకు రాష్ట్రంలో చోటు లేదు” అని ఆయన ట్వీట్ చేశారు.
సజ్జల వ్యాఖ్యలతో వివాదం మరింత తీవ్రమైంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకున్నాయి. అమరావతి రైతులు, మహిళలు సజ్జలపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, సజ్జల రామకృష్ణారెడ్డి తాజా వివాదాస్పద కామెంట్స్ రాష్ట్రంలో ఉద్రిక్తతను పెంచాయి. సజ్జలపై కేసు నమోదు, అరెస్టు అవకాశాలు రాజకీయ రగడను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో దీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.