చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదు
ప్రభుత్వ పథకాలపై అస్యత ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ సోదరి షర్మిలపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఫైర్ అయ్యారు. తన అన్న జగన్ సంపాదించిన అవినీతి సొమ్ములో వాటా ఉన్న షర్మిలకు రాష్ట్రంలో కోటి మంది మహిళలకు పసుపు- కుంకుమ కింద పదివేలు ఇస్తున్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. చుట్టపు చూపుగా వచ్చిన షర్మిలకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా? అని మండిపడ్డారు. చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్న షర్మిల తన నోటిని అదుపులోకి పెట్టుకోవాలని హితవుచెప్పారు. చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదన్నారు. పోలవరం గురించి మాట్లాడిన షర్మిల ఏనాడైనా ఆ ప్రాజెక్టును సందర్శించారా? అని ప్రశ్నించారు.
ఏపీపై మోదీ, కేసీఆర్ చేస్తున్న కుట్రలో జగన్ భాగస్వామి అని విమర్శించారు. ఇదే సమయంలో సినీ రచయిత కోన వెంకట్పైనా యామిని మండిపడ్డారు. బ్రాహ్మణులు అంతా వైసీపీకి మద్దతు పలుకుతున్నారని కోన వెంకట్ అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బ్రాహ్మణుల కోసం టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా టీడీపీ వైపే ఉందని పేర్కొన్నారు.













