రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయం : చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటువేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని అన్నారు. కోవింద్‌ను అభ్యర్థిగా ఎంపికచేసినట్టు ప్రధాని మోదీ తనకు ఫోన్లో చెప్పారనీ, వెంటనే తన మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. 26 ఏళ్ల క్రితం రామ్‌నాథ్ కోవింద్ బీజేపీలో చేరారనీ, ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు ఆయనపై లేవన్నారు. బీజేపీలో ఎన్నో పదవులను సమర్థంగా నిర్వహించారని, దళిత, వెనుకబడిన వర్గాల కోసం కోవింద్ పని చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రపతి అయ్యేందుకు అన్ని అర్హతలూ కోవింద్‌కు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అన్నివిధాల సహకారం అందిస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని ఓట్లు కోవింద్‌కే పడతాయని, కోవింద్‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. విభజన కష్టాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి మీ తోడ్పాటు అవసరమని అన్నారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, మురళీధర్‌రావు సహా పలువురని ఈ సందర్భంగా చంద్రబాబు ఘనంగా సత్కరించారు.













