జనసేనతో కలిస్తే వార్ వన్ సైడే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వార్ వన్ సైడే నని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విస్తృత స్థాయి శాంపిల్స్‌తో శాస్త్రీయంగా తాను జూన్, జులై మొదటి వారం వరకు సర్వే నిర్వహించానని ఆయన తెలిపారు. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ 93 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న వాటిల్లో సగం స్థానాల్లో గెలిచినా ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వైసీపీ కచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం ఏడు నుంచి ఎనిమిది ఉన్నాయని, మరో మూడు నుంచి నాలుగు స్థానాల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఇంగ్లిషు ఛానెళ్ల సర్వేలను చూసి తమ పార్టీ నాయకులు మురిసిపోతూ కూర్చుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.













