RRR – PV: రఘురామ Vs సునీల్ కుమార్.. పీక్కు చేరిన ‘ఖాకీ-ఖాదీ’ వార్!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ ఏసీబీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో రఘురామ కృష్ణరాజు అరెస్టు, కస్టడీలో చిత్రహింసల ఆరోపణల నేపథ్యంలో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి చుట్టూ తిరుగుతోంది. ఒక సిట్టింగ్ ఐపీఎస్ అధికారి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా విమర్శలు చేయడం, ఆయనకు శిక్ష పడటం ఖాయమని జోస్యం చెప్పడం సర్వీస్ రూల్స్ ఉల్లంఘన కిందకు వస్తుందా? అనే చర్చకు దారితీసింది.
కొన్ని రోజుల కిందట రఘురామ కృష్ణరాజుపై ఓ పోస్ట్ పెట్టిన పీవీ సునీల్ కుమార్, ఇవాళ ఏకంగా ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ కృష్ణరాజుపై విచారణ జరుగుతోందని, ఈ కేసులో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం ఖాయమని సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా జోస్యం చెప్పారు. ఒకవేళ పదవిలో ఉండగా ఆయన జైలుకు వెళ్తే అది రాష్ట్ర పరువుకు భంగమని, అందుకే వెంటనే ఆయన్ను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తాను కూడా ఎస్బీఐ ఖాతాదారుడినే కాబట్టి, ఈ బ్యాంకు మోసం కేసులో ఒక బాధితుడిగా ‘ఇంప్లీడ్’ అవుతానని ప్రకటించడం సంచలనం సృష్టించింది.
ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ, క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వ్యక్తులపై లేదా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం All India Services (Conduct) Rules, 1968కు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎస్ అధికారులు రాజకీయ అంశాలపై బహిరంగంగా స్పందించకూడదు. అసెంబ్లీ ద్వారా ఎంపికైన డిప్యూటీ స్పీకర్‌ను తొలగించాలని కోరడం పరోక్షంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయడమే అవుతుంది. గతంలో రఘురామ వేసిన కేసుల వల్ల సునీల్ కుమార్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దానికి ప్రతికారం తీర్చుకునే క్రమంలోనే ఆయన సర్వీస్ రూల్స్‌ను కూడా పక్కన పెట్టి మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా ఉన్న సమయంలో రఘురామను అరెస్టు చేసినప్పుడు, సునీల్ కుమార్ అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామ ఫిర్యాదు మేరకు సునీల్ కుమార్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే “నేను రాష్ట్రం కోసమే మాట్లాడుతున్నాను” అని ఆయన ఇస్తున్న క్లారిటీని విశ్లేషకులు ఒక డిఫెన్స్ మెకానిజంగా చూస్తున్నారు.
పీవీ సునీల్ కుమార్ వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. సర్వీస్ నిబంధనలను అతిక్రమించినందుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణలో ఉన్న కేసుల గురించి ముందే తీర్పును ప్రకటించడం, యావజ్జీవ శిక్ష పడుతుందని చెప్పడం న్యాయవ్యవస్థను కించపరచడమే అవుతుందనే వాదన కూడా ఉంది.
ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ, బాధ్యతాయుతమైన ఖాకీ దుస్తుల్లో ఉండి శాసనసభ గౌరవాన్ని ప్రశ్నించడం ఏ మేరకు సమంజసమనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రఘురామపై ఉన్న కేసులు న్యాయస్థానాల్లో తేలాల్సి ఉండగా, ముందే వీధి పోరాటానికి దిగడం సునీల్ కుమార్ వృత్తిగత భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.






