PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్‌పై వేటు ఖాయమా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ పోరు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవగా కాకుండా.. చట్టం, సర్వీస్ నిబంధనలు, రాజకీయ వ్యవస్థల మధ్య ఘర్షణగా మారుతోంది. గత కొన్నాళ్లుగా వీరి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం, సీబీఐ ఎఫ్ఐఆర్ నేపథ్యంలో తారాస్థాయికి చేరింది.
బ్యాంకుల కన్సార్టియంను మోసం చేశారనే ఆరోపణలపై రఘురామ కృష్ణరాజుపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేయడం ఈ వివాదాన్ని మలుపు తిప్పింది. దీనిని అస్త్రంగా చేసుకున్న పీవీ సునీల్ కుమార్, సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలకు దిగారు. ఒక రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై ఆర్థిక నేరారోపణలు రావడం నైతికంగా తప్పని, ఆయన తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. ఒక అడుగు ముందుకు వేసి, రఘురామకు యావజ్జీవ శిక్ష తప్పదని, అవసరమైతే తాను కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అవుతానని వీడియో సందేశం విడుదల చేయడం సంచలనం రేకెత్తించింది.
ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.. “సస్పెన్షన్‌లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి రాజకీయ విమర్శలు చేయవచ్చా?” అనేది. All India Services (Conduct) Rules, 1968 ప్రకారం, సర్వీసులో ఉన్న అధికారి సస్పెన్షన్‌లో ఉన్నా సరే ప్రభుత్వంపై గానీ, రాజకీయ నేతలపై గానీ బహిరంగంగా విమర్శలు చేయకూడదు. నియమం 7 ప్రకారం ఏ అధికారి కూడా ప్రభుత్వం లేదా వ్యవస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రకటనలు చేయకూడదు. సివిల్ సర్వెంట్స్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ, సునీల్ కుమార్ నేరుగా డిప్యూటీ స్పీకర్‌ను ఉద్దేశించి జైలుకు వెళ్లడం ఖాయం, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.. అని వ్యాఖ్యానించడం సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తనపై వ్యక్తిగత దాడికి దిగడమే కాకుండా, న్యాయస్థానంలో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా సునీల్ కుమార్ మాట్లాడుతున్నారని రఘురామ కృష్ణరాజు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్‌ను కేవలం సస్పెన్షన్‌తో వదిలేయకుండా, సర్వీస్ నుంచి పూర్తిగా డిస్మిస్ (Dismiss) చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా వీధి రౌడీలా మాట్లాడటం వ్యవస్థలకే ప్రమాదకరమని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫాలో అవుతుంది. మొదట నిబంధనల ఉల్లంఘనపై షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరుతుంది. ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న సునీల్ కుమార్‌పై కొత్త అభియోగాలతో సస్పెన్షన్ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. ఐపీఎస్ అధికారులు కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తారు కాబట్టి, విచారణ నివేదికను ఢిల్లీకి పంపడం. ఒకవేళ నేరం రుజువైతే ఆయన సర్వీస్ నుంచి తొలగించబడే (Compulsory Retirement or Dismissal) ప్రమాదం ఉంది.
రఘురామ కృష్ణరాజుపై ఉన్న సీబీఐ కేసు చట్టపరంగా నడుస్తుంది. కానీ, ఒక ఐపీఎస్ అధికారి ఆ తీర్పును ముందే ప్రకటించడం, రాజకీయ విమర్శలు చేయడం ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఈ పరిణామాలు పీవీ సునీల్ కుమార్ కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. డీజీపీ తీసుకోబోయే నిర్ణయం భవిష్యత్తులో ఇతర అధికారులకు ఒక సంకేతంగా నిలవనుంది.






