చంద్రగిరి ఎన్నికల ఇన్ఛార్జ్ నిషాంత్ రెడ్డిని మార్చకపోతే కౌంటింగ్ లో అక్రమాలు జరుగుతాయి.. పులివర్తి నాని..
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ నిశాంత్ రెడ్డిని తక్షణమే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చకపోతే కౌంటింగ్లో అక్రమాలు జరిగే అవకాశం ఉన్నాయని నాని పేర్కొన్నారు. తిరుపతిలో ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారని.. దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నాని పేర్కొన్నారు. దాడి జరిగిన తమను మాత్రం హౌస్ అరెస్టు చేస్తున్నారని.. దాడి చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మాత్రం బయట తిరుగుతున్నారని పులివర్తి నాని మండిపడ్డారు. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వెనుక చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటకు వెళ్లే దారి ఉంది కాబట్టి.. ఆ దారి గుండా దుండగులు అక్రమంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ లోపలికి చొరబడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను నిశాంత్ రెడ్డికి చెప్పినప్పుడు ఆయన వ్యంగ్యంగా నవ్వారని నాని ఆరోపించారు.













