విశాఖ నుంచి వెళ్లిపోవాలని జనసేనకు పోలీసుల నోటీసులు
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం విశాఖ పోలీసులు.. పవన్ కల్యాణ్ తో పాటు జనసేన కీలక నేతలకు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41ఏ ప్రకారం వీటిని జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలని సదరు నోటీసుల్లో జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటీసులను తీసుకునే విషయంలో జనసేన నేతలు, విశాఖ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నోటీసులు తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించారు. దీంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నామని నచ్చజెప్పారు.













