వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు లేరా…?
వైసీపీకి బలం..బలహీనత సీఎం జగన్మోహనరెడ్డి. ఆయనే ఆపార్టీకి బాహుబలి కూడా. అలాంటి సీఎం జగన్ .. ఇప్పుడు జనంపైకి ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. మొన్నటి వరకూ తనకు ఛానెల్స్ లేవని.. విపక్షాలకు ఛానెల్స్, పేపర్లు ఉన్నాయని ప్రసంగిస్తూ వచ్చారు. ఇప్పుడు తన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు లేరంటున్నారు సీఎం జగన్. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధులకు బటన్ నొక్కే కార్యక్రమంలో సీఎం జగన్.. విపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ ఓస్టార్ క్యాంపెయినర్ అని, బీజేపీలో ఉన్న వదిన పురంధేశ్వరి మరో స్టార్ క్యాంపెయినర్ అన్నారు. రాష్ట్రాన్ని చీల్చి, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్‌లోనూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ ఉన్నారంటూ … సోదరి షర్మిలను పరోక్షంగా టార్గెట్ చేశారు సీఎం జగన్.
పసుపు కమలాల మనుషులు బాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఇంకా స్టార్ క్యాంపెయినర్లు చాలామందే ఉన్నారు. అమరావతిలో బాబు బినామీలు ఉన్నట్లే.. ఇతర పార్టీల్లో చంద్రబాబు బినామీలు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికి గజ దొంగల ముఠా ఉంది. ఆయనకు మంచి చేసిన ఘనతే లేదు. పాలనతో మోసం చేసిన ఘనతే ఉందని విమర్శించారు. ఏం చేయని ఆయనకు ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. బాబును భుజాన మోసే ముఠా చాలామందే ఉన్నారు. తనకు అలాంటి వారు ఎవరూ లేరన్నారు. తను ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లన్నారు సీఎం జగన్.
జనమే స్టార్ క్యాంపెయినర్లు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ఎన్నికల యుద్ధంలో సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు అని ఎక్స్ వేదికగా మంగళవారం పేర్కొన్నారు. జగన్‌ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి, దగాపడ్డ అన్నదాత, ప్రభుత్వ బాదుడుతో బలైన పేదవాడు, అణచివేతకు గురైన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుడు వైసీపీని కూల్చే స్టార్ క్యాంపెయినర్లు అని కౌంటరిచ్చారు. అంతేకాదు.. ఓటమి ముందే తెలిసిపోవడంతో సీఎం జగన్ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారని ఆరోపించారు. జగన్ పాలనతో ఇబ్బందులు పడిన ప్రజలందరూ.. తప్పకుండా ఆయన్ను గద్దె దించుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీ, టీడీపీలకు చాలా కీలకం. అందుకే అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను విరివిగా వినియోగిస్తున్నాయి. విపక్షం కూటమిగా వెళ్లి వైసీపీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుండగా.. సింగిల్‌గా వెళ్లి గెలుపు సాధించాలని ఫ్యాన్ పార్టీ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సీఎం జగన్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. ఆపై యుద్ధరంగంలో సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడు తన సోదరే .. డైరెక్టుగా విమర్శలు గుప్పించడం .. జగన్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. దీన్ని ఆయనే పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు కూడా..













