పదోతరగతి పరీక్షలా..పిల్లల ప్రాణాలతో చెలగాటమా?
– ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై పవన్ ధ్వజం
– పొరుగు రాష్ట్రాలను చూసైనా మారాలని హితవు
ఓ వైపు కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉగ్రరూపం దాల్చుతుంటే… ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవుతుండడం సరైంది కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఈ నిర్ణయింపై విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన కనిపిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి పొరుగునే ఉన్న తెలంగాణ, తమిళనాడు, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంలేదని, డిగ్రీ, పీజీ పరీక్షలే రద్దయిపోయాయని, ఎంట్రన్స్ ఎగ్జామ్ లు, ఉద్యోగ నియామక పరీక్షలు కూడా జరపడంలేదని పవన్ గుర్తు చేశారు. హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైతే అక్కడి హైకోర్టు అంగీకరించలేదని అన్నీ తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం మొండివైఖరి అవలంభించడం విడ్డూరమన్నారు.
పరీక్ష పేపర్ల సంఖ్య కుదించినా… ఏపీలో కరోనా విజృంభిస్తోందని, వేల కేసులు నమోదైన నేపథ్యంలో విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం ప్రమాదకరం అవుతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజా రవాణా వాహనాలే పూర్తిస్థాయిలో లేవని, ప్రైవేటు వాహనాలు కూడా సరిగా అందుబాటులో లేవని, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మనోభావాలను, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విజ్ఞతతో, విద్యార్థుల క్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఇదని స్పష్టం చేశారు.













