టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. తెలుగుదేశం పార్టీతో ఆయన కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. బీసీ వర్గానికి చెందిన ఆయన విద్యావంతుడు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాఖ పట్నం జిల్లా తెలుగు అధ్యక్షుడిగా నాలుగేళ్ల నుంచి వ్యవహరిస్తున్న ఆయన, ఈ ఎన్నికల్లో గాజువాక స్థానం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కె.అచ్చన్ననాయుడిని మంత్రివర్గంలోకి తీసుకువడంతో కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.













