ఫ్యామిలీ ఫిజిషియన్ కు ఎన్నారైల చేయూత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఫ్యామిలీ ఫిజీషియన్ విధానానికి చేయూతనిచ్చేందుకు పలువురు ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) సంసిద్ధత వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రభుత్వ వైద్య సలహా దారు డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు. ఆయన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ విత్ ఇండియన్ ఆరిజిన్ (ఆఫి) గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవి కొల్లి, ప్రముఖ నియోనేటాలజిస్ట్ డాక్టర్ ప్రకాశ్, ట్రెయిన్ అండ్ హెల్ప్ బేబీస్ డైరెక్టర్ సింగం హరిబాబుతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజినిని కలిశారు. ఈ సందర్భంగా వాసుదేవ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రసూతి, శిశు మరణాలకు గల కారణాలపై పరిశోధన ద్వారా గుర్తించిన అంశాల అధారంగా తిరుపతి, గుంటూరు వైద్య కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డాక్టర్ రవి కొల్లి మాట్లాడుతూ భారత్‌లోని వివిధ రాష్ట్రాలో ఆయా ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. మాతాశిశు సంరక్షణకు అందించే చికిత్సలో ఆధునిక పద్ధతులు అవలంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
టెక్సాస్‌లో ట్రెయిన్ అండ్ హెల్ప్ బేబీస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మాతాశిశు సంరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నియోనేటాలజిస్ట్ ప్రకాశ్ కబ్బూర్ తెలిపారు. రాష్ట్రంలో తమ వంతు సేవలు అందిచేందుకు సిద్ధం ఉన్నామన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో గత పదేళ్లుగా ట్రైన్ అండ్ హెల్ప్ బేబీస్ సంస్థను నిర్వహిస్తున్నామని డాక్టర్ సింగం హరిబాబు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాకట, గోవాలతో పాటు తెలంగాణలోని నల్గొండలో కూడా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.













