కేసులతో లోకేశ్ బిజీబిజీ.. పాదయాత్ర వాయిదా..!
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఓ వైపు తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం, మరోవైపు ఆయన కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో లోకేశ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే ఈ కేసు వ్యవహారం ఇప్పటికిప్పుడు తేలేలా లేదు. దీంతో పాదయాత్రను పునఃప్రారంభించాలని లోకేశ్ భావించారు. రేపటి నుంచి పాదయాత్ర మళ్లీ మొదలు పెట్టాలనుకున్నారు. అయితే ఆయన ఈ సమయంలో పాదయాత్ర చేపట్టడం సమంజసం కాదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి. దీంతో లోకేశ్ తన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర 200 రోజులకు పైగా సాగింది. రాయలసీమ, కోస్తా జిల్లాల మీదుగా యాత్ర సాగింది. తూర్పుగోదావరి జిల్లా జక్కంపూడికి చేరుకోగానే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దీంతో పాదయాత్ర నిలిచిపోయింది. సెప్టెంబర్ 9న పాదయాత్రకు బ్రేక పడింది. అప్పటి నుంచి లోకేశ్ కోర్టు వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. చంద్రబాబు నాయుడికి బెయిల్ తీసుకురావడం లాంటి వ్యవహారాల్లో నిత్యం లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీలో మకాం వేసిన లోకేశ్ అక్కడి నుంచే పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
అయితే పాదయాత్రను సుదీర్ఘకాలం బ్రేక్ వేయడం తప్పుడు సంకేతాలు పంపుతుందని లోకేశ్ భావించారు. అందుకే వీలైనంత త్వరగా మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టాలనుకున్నారు. కేసు వ్యవహారాలను పార్టీ చూసుకుంటుందని భావించిన ఆయన రేపటి నుంచి పాదయాత్ర షురూ చేయాలనుకున్నారు. రేపు రాత్రి 8.15 నిమిషాలకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఢిల్లీ నుంచి రాగానే పాదయాత్ర మొదలు పెట్టాలని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అనుచరులకు సూచించారు. పార్టీ శ్రేణులు ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాయి. అయితే చివరి నిమిషంలో పాదయాత్రకు బ్రేక్ పడింది.
లోకేశ్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తనను తాను నిరూపించుకునేందుకు ఆయనకు గొప్ప అవకాశం లభించిందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే నిత్యం ప్రజల్లో ఉంటేందుకు పాదయాత్ర ఎంతో దోహదం చేస్తుందునుకున్నారు. ఆ ఉద్దేశంతోనే లోకేశ్ మళ్లీ జనాల్లోకి వెళ్లాలనుకున్నారు. కానీ ఆయన కాళ్లకు బంధం వేశారు టీడీపీ నేతలు. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర చేపడితే చంద్రబాబు కేసు వ్యవహారాలు పర్యవేక్షించేందుకు ఇబ్బంది కలుగుతుందని సూచించారు. నిత్యం లాయర్లతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని.. ఢిల్లీ, విజయవాడ తిరగాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే పాదయాత్ర వద్దని సూచించారు. దీంతో లోకేశ్ పాదయాత్ర విరమించుకున్నారు. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కామ్ కేసుల్లో లోకేశ్ ను కూడా అరెస్టు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది.













