ఐటి హబ్‌గా ఆంధ్రప్రదేశ్ : లోకేష్
ఉత్పాదక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక ప్రగతికి దోహదపడే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతున్న నేపధ్యంలో మంత్రి లోకేష్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకరప్రసాద్, ఆ శాఖ కార్యదర్శి అజయ్ సహాని, ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్ర, అసోసియేషన్ ప్రతినిధులతో ఢిల్లీలో కలిసి ఐటీ రంగ అభివృద్ధికి అనుసరించవలసిన కార్యచరణపై చర్చించినట్లు తెలిపారు. తొలుత మంత్రి లోకేష్ ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్ర, అసోసియేషన్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ భవన్లో సమావేశమై ఐటి రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతినిధులకు వివరించి ఇందుకు సహకరించాలని ప్రతినిధులను కోరారు. మహిళలు, యువత, విద్యార్థులకు గ్రామ, పాఠశాలస్థాయి నుంచి మొబైల్స్ తయారీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ఐటీ రంగంలో లక్ష మందికి పారిశ్రామిక రంగంలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు వివరిస్తూ, ఇందుకు ఆయా సంస్థలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
చైనాతో పోటీ పడి ఇండియాలో మొబైల్ తయారీ రంగం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని టాక్స్ రాయితీలు, విధాన పరమైన నిర్ణయాలు, ఇతర దేశాలకు మొబైల్ ఎక్స్‌పోర్టు చేసేందుకు రాయితీలు అవసరమని ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు.













