నారా లోకేశ్ కు స్వల్ప ఊరట … సీఐడీ విచారణను
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేశ్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేశ్ తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. హెరిటేజ్ సంస్థలో లోకేశ్ షేర్ హోల్డర్ అని, ఆయనకు తీర్మానాలు ఇవ్వాలన్నా, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వాలన్నా కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని కోర్టుకు వివరించారు. లోకేశ్‌ను ఇవి అడగడం సమంజనం కాదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. దీనిపై స్పందించిన పోసాని అంత తొందరేముందని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబరు 10న సీఐడీ విచారణకు లోకేశ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు న్యాయవాది సమక్షంలోనే నారా లోకేశ్ ను విచారించాలని సీఐడీ అధికారులను ఆదేశించింది హైకోర్టు.













